ఒక్క గజ్వేల్‌లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులు: ఈటల రాజేందర్
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బీఆర్‌ఎస్ కార్యకర్తలకే 'బీసీ బంధు' దక్కిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు.
By అంజి Published on 6 Nov 2023 8:15 AM GMTఒక్క గజ్వేల్‌లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులు: ఈటల రాజేందర్
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బీఆర్‌ఎస్ కార్యకర్తలకే 'బీసీ బంధు' దక్కిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో బీసీలు, రైతులు, దళితులు.. ఎవరూ కూడా సంతోషంగా లేరని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అసైన్డ్, ప్రభుత్వ భూములను అమ్ముకుంటోందని, రూ. లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారని ఈటల ఆరోపించారు. ప్రభుత్వం పాలన చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో సోమవారం నాడు నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటూ కొందరు విమర్శిస్తున్నారని.. అలా అయితే తాను గజ్వేల్‌లో ఎందుకు పోటీ చేస్తానని ఈటల ప్రశ్నించారు.
నీళ్ళు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ సంపూర్ణంగా విఫలమయ్యారని అన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల 5,800 ఎకరాల భూమిని అభివృద్ధి పేరిట తక్కువ ధరలకు కేసీఆర్ ఫ్యామిలీ తీసుకుందని ఆరోపించారు. ఒక్క గజ్వేల్‌లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీని ఓడించడం బీజేపీకే సాధ్యం అని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి కమలం పార్టీతోనే సాధ్యమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు బీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో హంగ్ వస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఈటల రాజేందర్ అన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి పని చేశాయని అన్నారు.