ఈటెల అంశం.. కావాలనేనా.. లేక..!
Etela Rajender Land Scam Allegations. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని
By Medi Samrat Published on 1 May 2021 1:54 PM ISTతెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని అసైన్డ్ భూములను మంత్రి ఈటల రాజేందర్ కాజేశారంటూ ఆరోపణలు వచ్చాయి. తాను ఎటువంటి భూదందాకు పాల్పడలేదని.. తప్పుడు ఆరోపణలు అంటూ ఈటల చెప్పుకొచ్చారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని అన్నారు. ఈ రోజు ఉదయం నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలతో భూములను సర్వే చేశారు. మంత్రి ఈటలకు చెందిన హేచరీస్‌లోనూ డిజిటల్ సర్వే చేశారు. వాటి పక్కన ఉన్న అసైన్డ్ భూములను పరిశీలించారు. మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో వాటికి సంబంధించిన రికార్డులను మెదక్ కలెక్టర్ హరీశ్ పరిశీలించి, అచ్చం పేటలోనూ విచారణ జరిపారు. రైతుల నుంచి ఆయన వివరాలు తీసుకున్నారు. ఆ భూముల్లో అసైన్డ్ భూమి ఉన్నట్లు విచారణలో తేలిందని మీడియాకు తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత నివేదిక ఇస్తామని చెప్పారు.
మంత్రి ఈటల రాజేందర్ తమ భూములను కబ్జా చేశారని అచ్చంపేటకు చెందిన రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుపై సీఎం సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి భూ వివాదంపై అధికారులు అచ్చంపేటలో విచారణ చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా అచ్చంపేట, హకీంపేట మధ్య, మంత్రి ఈటల ఫామ్‌హౌస్ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు.
అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్దేశపూర్వకంగానే తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనను పిలిపించి అడిగితే బాగుండేదని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ వారు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. తనపై వస్తున్న కట్టు కథలను చూస్తుంటే బాధ కలుగుతోందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత పత్రిక, చానల్ లోనే తనకు వ్యతిరేకంగా వరుస కథనాలు వస్తున్నాయని అన్నారు. విచారణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అన్నారు. తనకు అన్నిటికన్నా ఆత్మాభిమానమే ముఖ్యమని.. తాను తప్పు చేసినట్టు విచారణలో రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని అన్నారు. ఈటల అంశంపై పార్టీ నేతలు, శ్రేణులు మాట్లాడరాదని టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశించింది. కనీసం ఫోన్ ద్వారా కూడా మాట్లాడవద్దని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈటల నివాసం వద్దకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.