కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు

Etela Rajender Fire On CM KCR. సీఎం కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ మ‌రోమారు స‌వాల్ విసిరారు.

By Medi Samrat  Published on  30 July 2022 1:00 PM GMT
కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు

సీఎం కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ మ‌రోమారు స‌వాల్ విసిరారు. కేసీఆర్.. హుజురాబాద్ పోటీ చేసినా పర్లేదు, గజ్వేల్‌లో పోటీచేసినా పర్లేదు.. ఆప్షన్ నీకే వదిలేస్తున్నా అంటూ స‌వాల్ విసిరారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు.. విర్రవీగవద్దు అంటూ కేసీఆర్‌పై ధ్వ‌జ‌మెత్తారు. బ్రహ్మ దేవుడు కూడా టిఆర్ఎస్‌ను కాపాడలేడని.. వాస్తవాన్ని చూడలేని కబోదులు టిఆర్ఎస్ నాయకులని నిప్పులు చెరిగారు. హుజురాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక‌పై ఈటెల స్పందించారు. నేను, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి మిత్రులం. ఆయన తిరుపతి కొండమీదనే చెప్పారు. మోదీ పాలనలో దేశం ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని. హుజురాబాద్ ఎన్నికల సమయంలో కూడా ఆయన ప్రకటన చేశారు. ఈటెల రాజేందర్ గెలిస్తేనే ధర్మం గెలిచినట్టు, ప్రజాస్వామ్యం గెలిచినట్టు అని. ఈరోజు ఆయన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి వస్తారని ఆశిస్తున్నాను. ఆయన భారతీయ జనతా పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నానని అన్నారు.

రాజయ్య యాదవ్ 2001 నుంచి ఈరోజు వరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు. మెదక్ జిల్లా ఇంచార్జ్‌గా కూడా పనిచేశారు. షీప్ ఫెడరేషన్‌కు చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇంకా చాలామంది రాజీనామా చేసేవారు ఉన్నారు. మీ ఊహకు అందనంత మార్పు జరుగుతుంది. పెద్ద ప్రళయం ఉంటుంది. ఇప్పటికే అన్ని పార్టీలలో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారు. ఎవరు టచ్ లో ఉన్నారో చెప్పమని అడుగుతున్నారు అలా బయటకు చెప్తామా? ఒక రాజయ్య యాదవ్ రాజీనామా చేస్తేనే ఢిల్లీ నుంచి 20, 30 సార్లు ఫోన్ వచ్చిందంట అని ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కేంద్ర పార్టీ కోరుకుంటుంది. అందులో భాగంగా నాకు కూడా ఒక బాధ్యత అప్పగించారు. గత 20 సంవత్సరాలుగా అన్ని పార్టీలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆ పనిని ధర్మబద్ధంగా నిర్వహించే ప్రయత్నం చేస్తాను. పెద్ద నాయకులు ఒక ఎత్తు. చిన్న నాయకులు ఒక ఎత్తు. అందరినీ చేర్చుకుంటాము. ఇక్కడ హుజురాబాద్ లో కూడా టిఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మా వాళ్ళు కోప్పడతారని ఆగుతున్నాను.

పెద్దపల్లి వెళ్తే అక్కడ టిఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుని ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టాను.. అంటే నా సంబంధాలు ఏంటో అర్థం చేసుకోవాలి. బ్రహ్మ దేవుడు కూడా టిఆర్ఎస్‌ను కాపాడలేడు. వాస్తవాన్ని చూడలేని కబోదులు టిఆర్ఎస్ నాయకులు. విరుచుకుబడి మాట్లాడుడు, దాడి చేసుడు, పైసలు ఇచ్చి ప్రలోభ పెట్టుడు, పదవులు ఇస్తాను అని ప్రలోభ పెట్టుడు చేస్తున్నారు. ఎంతమందిని బెదిరిస్తారు.. ఎంతమందికి పదవులు ఇస్తారు.. ఇంకో సంవత్సరం ఉంది కాబట్టి బిల్లులు రావాలి అని ఆగుతున్నాము.. అన్నీ వచ్చిన తర్వాత బయటపడతాము అని వందల మంది సర్పంచులు, ఎంపీటీసీలు నాకు చెప్తున్నారని చెప్పారు.

ప్రళయం సృష్టించాలని పార్టీ నాకు బాధ్యత అప్పగించింది. భారతీయ జనతా పార్టీ మెట్లు ఎక్కే దశలో లేదు.. రాకెట్ వేగంతో దూసుకుపోతుందని అన్నారు. నేను గజ్వేల్లో పోటీ చేస్తాను అని ఛాలెంజ్ చేశాను. హుజురాబాద్ ఎన్నికల సమయంలో శిఖండిలాగా వేరే వాళ్లను ఎందుకు ముందు పెడతావు.. నువ్వు వస్తావా ? మీ అల్లుడు వస్తారా ? వచ్చి పోటీ చేయండి అని సవాలు విసిరినట్లు గుర్తు చేశారు. ఆరోజు ఎన్నికల్లోనే హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కి మధ్య పోటీ అని చెప్పి ప్రచారం చేసి గెలిచామ‌న్నారు. గెలిచిన తర్వాత ఒక్క రోజు కూడా ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటిస్తుందా.? కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తే కూడా పిలుపు ఇవ్వడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా నా హక్కులకు, నా ప్రోటోకాల్ కు భంగం కలిగించలేదని అన్నారు.

గత తొమ్మిది నెలలుగా ఏ శంకుస్థాపన చేసిన ఆ శిలాఫలకం మీద నా పేరు లేదని.. నేను గతంలో తెచ్చిన నిధులను పేరు మార్చి కొత్తగా శిలాఫలకాలు వేసుకుంటున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నా జీవితంలో కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు.. గజ్వేల్ లో పోటీ చేస్తా అని చెప్పిన.. నా పోరాటం ఇక్కడ ఉన్న వారితో కాదు కేసీఆర్ తో.. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌లో పోటీ చేసినా పర్లేదు, గజ్వేల్ లో పోటీచేసిన పర్లేదు అని కేసీఆర్ కి మరోసారి సవాలు విసురుతున్నా. ఆప్షన్ నీకే వదిలేస్తున్నా.. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు విర్రవీగ వద్దు కేసీఆర్ అని తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు.

నేను గెలిచిన తరువాత 9 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరంగా హుజురాబాద్ కోసం ఒక జీవో కూడా విడుదల చేయలేదు. అప్పట్లో డిఎంఎఫ్టీ కింద, మున్సిపాలిటీ కింద నేను తెచ్చిన నిధులు తప్ప ఒక్క రూపాయి కొత్తగా రాలేదు. అవగాహన లేనివారు మాట్లాడితే.. నేను ఏం సమాధానం చెప్పాలి. నాది ఇప్పుడు కేసీఆర్ ఓడగొట్టే మిషన్ అని అన్నారు.

హుజూరాబాద్ లో అభివృద్ధి బొచ్చడంత చేశానని.. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో వంద ఏళ్లకు సరిపడే అభివృద్ధి చేస్తాన‌ని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సత్తా లేదని టేకుర్తిలో, మడిపల్లిలో మంచినీళ్లు మోటర్లు కొనిపించాను. గన్ముక్కులలో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పని చేస్తున్నాను. మా ప్రజలకు కష్టం రాకుండా చూసుకుంటాను. నియోజకవర్గంలో ప్రజల కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే.. పంటితో పీకే విధంగా ప్రేమగా పనిచేస్తున్నాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు అన్ని మండల కేంద్రాల్లో హాస్పిటల్, బళ్ళు కట్టించాను. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకొని చూసుకోవాల‌ని అన్నారు. వచ్చేది బీజేపీ మా ప్రభుత్వంలో హుజురాబాద్ 100 సంవత్సరాలకు సరిపడే అభివృద్ధి చేసి చూపిస్తానని ఈటెల వ్యాఖ్యానించారు.


Next Story
Share it