మమ్మల్ని కాదు.. సభానియమాలను ఉల్లంఘించిన సీఎంను సస్పెండ్ చెయ్యాలి..
Etela Rajender Fire On CM KCR. ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణ చేయాలని హైకోర్టు స్పీకర్ ను కోరిందని.. మేము రేపు ఉదయం 9 గంటలకు
By Medi Samrat Published on 14 March 2022 9:37 PM IST
ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణ చేయాలని హైకోర్టు స్పీకర్ ను కోరిందని.. మేము రేపు ఉదయం 9 గంటలకు స్పీకర్ ను కలుస్తామని బీజేపీ ఈటల రాజేందర్ అన్నారు. చట్టసభలు సమావేశాలు జరిపి ప్రజా సమస్యలను చర్చించాలని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు 150 రోజులు జరుగుతాయని.. అసెంబ్లీ కూడా 80 రోజులు పాటు సమావేశం అవుతాయని.. ప్రజల సమస్యలపై చర్చిస్తారని అన్నారు. స్పీకర్ గా ఎన్నికైన వారు ఏ పార్టీకి సంబంధించిన వారుగా ఉండరని. కానీ ఈ స్పీకర్ సీఎం గారి కనుసన్నల్లో నడుస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేదని నిరసన చెప్తే మమ్ముల్ని సస్పెండ్ చేశారని.. కానీ అసలు కారణం అది కాదని. బీజేపీ వారు ఉంటే వారి ఆటలు సాగవు అని బయటికి పంపించారని ఈటెల అన్నారు.
ముఖ్యంగా నన్ను అసెంబ్లీ కి రాకుండా చేయాలని కెసిఆర్ చూశారని.. ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు అని నన్ను మాట్లాడకుండా చేయాలని బయటికి పంపించారని.. సభానియమాలను ఉల్లంఘించిన సీఎంను సస్పెండ్ చెయ్యాలని.. మమ్మల్ని కాదని అన్నారు. దేశ్ కి నేత కెసిఆర్ అని.. వివిధ రాష్ట్రాల్లో వందలకొట్ల ఖర్చు పెట్టి పేపర్ ఆడ్స్, ఫ్లెక్సీ లు పెట్టించుకుంటున్నారని.. అనేక విమర్శలు బీజేపీ మీద చేసిన కెసిఆర్.. 5 రాష్ట్రాల ఫలితాల తరువాత ఎక్కడ పడుకున్నాడు అని ప్రజలు అడుగుతున్నారని అన్నారు.
బంగాళాఖాతంలో వేయాల్సింది కెసిఆర్ ప్రభుత్వాన్ని.. మోదీ ప్రభుత్వాన్ని కాదని ఈటెల అన్నారు. హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం మేము రేపు అసెంబ్లీ కి వెళతామని.. దోపిడీ చేయకపోతే, అక్రమాలు చేయకపోతే ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రానికి డబ్బులు ఎలా పంపిస్తారని.. అన్ని వేల కోట్లు మీకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇది దుర్మార్గ పాలన అని, కెసిఆర్ ఒక నీచమైన ముఖ్యమంత్రి అని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఈటెల అన్నారు. నీవు మమ్మల్ని సస్పెండ్ చేసినట్టే నిన్ను కూడా తెలంగాణ ప్రజలు సస్పెండ్ చేస్తారని.. నీ భరతం పడతారు.. నిన్ను నిషేదిస్తారు.. శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా చేస్తారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ నిశితంగా గమనించి.. ఇలాంటి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటానికి అండగా ఉంటారని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.