ఈటల రాజేందర్ భార్య సంచలన వ్యాఖ్యలు
Etela Rajendar Wife Jamuna Sensational Comments. ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక
By Medi Samrat
ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నియోజక వర్గం నుంచి ఈటల రాజేందర్ పోటీకి దిగకుండా ఆయన భార్య జమునను బరిలోకి దింపుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా జమున తాజాగా వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ పోటీలో తాను కూడా ఉన్నట్లు జమున చెప్పుకొచ్చారు. ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన భర్త పోటీ చేసినా, తాను పోటీ చేసినా ఒక్కటేనని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ తాను తన భర్త ఈటలను వెనకుండి నడిపించానని ఆమె తెలిపారు. ప్రతి ఎన్నికల్లో ఈటల ముందుండి ప్రచారం చేశానని అన్నారు. తమ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లం పోటీ చేస్తామని చెప్పారు. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్‌లోని పలు వార్డుల్లో ఆమె ప్రచారం చేస్తున్నారు.
ఈటల రాజేందర్ రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉండడానికి, ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి, 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్రకు జులై 19 నుండి శ్రీకారం చుడుతున్నానని అన్నారు. ఉదయం 7.30 ని.లకు కమలాపూర్ మండలం బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుండి ప్రారంభం అయ్యే ఈ ప్రజా పాదయాత్రకి మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. నా అడుగులకు మీ అండదండలు కావాలి. నా ప్రస్థానానికి మీ ప్రేమాభిమానాలు కావాలి. ప్రజా దీవెన యాత్రకి మీ అందరి దీవెనలు కావాలి. ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు అని ఈటల రాజేందర్ ప్రకటించారు.