కరోనా సెకండ్ వేవ్‌తో ఢీలా పడ్డ తెలంగాణ రాజకీయాలు.. మాజీమంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంతో ఒక్కసారిగా హీటెక్కాయి. కబ్జా ఆరోపణల నేఫథ్యంలో ఈటలను మంత్రివర్గం నుండి తప్పించడం.. వాటిపై ఆయన స్పందించడం జరిగాయి. అయితే కబ్జా ఆరోపణలపై తాజాగా ఈటల భార్య జమునా రెడ్డి స్పందించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మేము ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. పేదలకు సంబంధించిన 100 ఎకరాల భూములు కాజేశామని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడ్రన్ హ్యాచరీస్ పెట్టాలని మాసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశామని.. అంత కంటే ఎక్కువ భూమిని చూపిస్తే మేము ముక్కు నేలకు రాస్తామని.. లేదంటే అధికారులు ముక్కు నేలకు రాస్తారా.. అని సవాల్ విసిరారు. ప్రభుత్వమే ఇలా చేస్తే పేద ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో మేము ఆస్తులు అమ్ముకున్నామని తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొనేందుకేనా ఉద్యమంలో పాల్గొన్నది అని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలబడవని.. ఏదో ఒక రోజు నిజాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. ఓ పత్రికలో వచ్చిన కథనాలపై మాట్లాడుతూ.. తప్పుడు వార్తలు ఎందుకు రాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.