టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు..!
Etela Rajendar Sensational Comments On Govt. భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 10 July 2021 4:14 PM ISTభారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక జరగబోతుండడంతో హుజూరాబాద్ ప్రజలను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారని.. ఇతర ప్రాంతాల ఓటర్లను ఇక్కడి ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని అన్నారు. దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని.. ఒక్కో ఇంట్లో 30 నుంచి 40 దొంగ ఓట్లను కూడా నమోదు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ చేస్తున్న చట్ట విరుద్ధమైన పనులకు సహకరిస్తున్న అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. హుజూరాబాద్, జమ్మికుంటలో దొంగ ఓట్లపై ప్రజలు నిఘా పెట్టాలని, ఎవరి ఓటును వారు కంటికి రెప్పలా కాపాడుకోవాలని అన్నారు. సొంత నియోజకవర్గంలో గెలిచి టీఆర్ఎస్ కు షాకివ్వాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికలో గెలవడం ద్వారా తమకు తిరుగులేదనే సంకేతాలను ప్రజల్లోకి పంపించాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
ప్రజల సంక్షేమం కోసం ప్రశ్నిస్తేనే తనను బయటికి పంపారని ఈటల రాజేందర్ అన్నారు. 18 ఏళ్లుగా తమ్ముడిగా పిలిచి.. అర గంటలోనే దెయ్యం ఎలా అయ్యానని ప్రశ్నించారు. 2018 ఎన్నికల సమయంలో ఓ వ్యక్తితో నా మీద కరపత్రాలు, పోస్టర్లు కొట్టించి, నా వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. నా దగ్గరకు ఎవరూ వచ్చినా నా చేతనైనా సాయం చేశానని తెలిపారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడూ డబ్బు, దర్పం చూపలేదన్నారు. తనకు టికెట్ ఇచ్చినవాళ్లే తనను ఓడగొట్టాలని చూశారని.. అధికార పార్టీలో ఉన్నా కూడా తన ఇంటి మీద పోలీసులతో దాడి చేయించారని విమర్శించారు. వాటన్నింటినీ భరిస్తూ వచ్చానని తెలిపారు. ప్రజల తరఫున పింఛన్లు ఇవ్వాలని అడిగానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఫించన్లు, కొత్త రేషన్ కార్డులు కావాలని అధిష్టానాన్ని కోరానన్నారు. ఇవన్నీ అడిగినందుకే తనను బయటకు పంపారన్నారు. అందరూ ఆలోచించి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఉద్యమకారుల రక్తాన్ని చూసినవారు కేసీఆర్ వెంట ఉన్నారని ఆయన గుర్తు చేశారు. మీ ఓటును తొలగించకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలని ప్రజలను కోరారు. అధికారులు బాధ్యత మరిచి వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.