గెంటేసిన వాళ్లు మళ్లీ పిలిచినా పోను : ఈటల రాజేందర్
Etela Rajendar Comments On Cm KCR. తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కూడా హ్యాపీగా లేరని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
By Medi Samrat Published on 12 Feb 2023 1:45 PM GMTతెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కూడా హ్యాపీగా లేరని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. 2.90 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా 12వ తేదీ వరకు జీతాలు రాలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. సభలో సంఖ్యా బలంతో గంటల సేపు అధికార పార్టీ వారు మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి మాయ చేయాలని చూశారని ఆరోపించారు. ఎన్నికల సంవత్సరం కాబట్టి ఎన్నో మాటలు చెప్పారు. అయినా ప్రజలు నమ్మరని అన్నారు.
రుణమాఫీ అయ్యిందా..రైతులకు తెలియదా? తన వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి మోదీ మీద విమర్శలు చేశారని కేసీఆర్‌ను విమర్శించారు. మళ్ళీ దేశానికి ప్రధాని మోదీనే.. సగానికి పైగా సీఎం చెప్పిన లెక్కలు తప్పు.. 140 కోట్ల ప్రజలు గౌరవించే వ్యక్తి మోదీ అని ఈటల రాజేందర్ అన్నారు. నేను పార్టీ మారలేదు, వాళ్లే నన్ను గెంటివేశారని అన్నారు. గెంటివేసిన వాళ్ళు మళ్లీ పిలిచినా పోను అని స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈటల చరిత్ర తెలిసిన వాళ్ళు.. నా గురించి తక్కువ ఆలోచన చేయలేదు. ఈటెల పార్టీ మారుతున్నారని వైఎస్ హయాంలో కూడా ఇలాగే ప్రచారం చేశారు. ఇవాళ సీఎం నా పేరు ప్రస్తావించగానే పొంగిపోను.. నా మీద చేసిన దాడి మరిచిపోను అని ఈటల అన్నారు. సంకుచితంగా వ్యవహారం చేయొద్దు.. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పినంత మాత్రాన నేను పొంగిపోను అని అన్నారు. టీఆర్ఎస్ లో సైనికుడిగా పని చేశా.. బీజేపీ లో కూడా సైనికుడిగా పని చేస్తా అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
నేను బీజేపీ లీడర్, జాతీయ ఎక్జిక్యూటివ్ కమిటీ సభ్యుడుని.. సభలో నా సొంత అజెండా ఉండదు. తెలంగాణ ప్రజల గొంతు వినిపిస్తానని అన్నారు. మెస్ చార్జీల మీటింగ్ కి పిలిస్తే తప్పకుండా వెళ్తా అని ఈటల పేర్కొన్నారు.