నా సవాలుకు కట్టుబడే ఉన్నా.. గజ్వేల్ నుండి సీఎం మీద పోటీ చేస్తా : ఈటల రాజేందర్
Etala Rajender challenges CM KCR. ఆదివారం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలపై స్పందించారు.
By Medi Samrat Published on 11 July 2022 6:50 PM ISTఆదివారం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలపై స్పందించారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ నేతలు కేసీఆర్పై విరుచుకుపడుతూ ఉన్నారు. తాజాగా ఈటల రాజేందర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ రెండు రోజుల క్రితం చెప్పిన ఈటల రాజేందర్.. తాను చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నానన్నారు. గజ్వేల్ లో పోటీ చేసి తీరుతానని చెప్పారు. నందిగ్రామ్ లో మమతను ఓడించిన సువేంధు అధికారిలా తాను గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించి తీరుతానని తెలిపారు. వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదన్నారు ఈటల రాజేందర్. తనకు మాటలు వచ్చని.. తన తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారని అన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి చిల్లరగా మాట్లాడుతున్న కేసీఆర్ ను చూసి తెలంగాణ ప్రజలు ఛీదరించుకుంటున్నారని.. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు పట్టిన గతే తెలంగాణలో కేసీఆర్ కు పట్టబోతుందని అన్నారు. కేసీఆర్ కు అహంకారం బాగా పెరిగిపోయిందని చెప్పారు. తనకు బానిసలుగా ఉండేవారికే పార్టీలో కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారని.. తాను ఉద్యమకారుడిని కాబట్టే తప్పులను ప్రశ్నించానని రాజేందర్ అన్నారు. 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో తన మీద ఏ రాజకీయ పార్టీ నేత కూడా చిల్లర వ్యాఖ్యలు చేయలేదన్నారు. కేసీఆర్ ఎంత దిగజారి వ్యవహరిస్తున్నా తాను స్పందించడం లేదని చెప్పారు. హుజురాబాద్ లో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కేసీఆర్ ను అక్కడి ప్రజలు బొంద పెట్టారని అన్నారు. గజ్వేల్ లోనూ ఆయనకు బొంద పెట్టడం ఖాయమన్నారు. తనకు కేసీఆర్ బలం, బలహీనత, భయం అన్ని తెలుసన్నారు. గజ్వేలో లో ఏం జరగబోతుందో ప్రజలంతా చూడాలని అన్నారు.