హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగురవేసే గాలి పటాలకు నైలాన్ దారాలను లేదా మాంజాను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వీటి విక్రయాన్ని నిషేధిస్తూ 2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రధాన బెంచ్ వెల్లడించిన తీర్పును అమలు చేయాలని పేర్కొంది. ఉత్తర్వుల అమలుపై వివరాలు సమర్పించాలని హోం, అటవీ, పర్యావరణ శాఖల సీఎస్‌లకు, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది పి.రమ్యశ్రీ వాదనలు వినిపించారు. గాలిపటాలు ఎగురవేయడానికి సంప్రదాయ నూలు దారానికి బదులు సింథటిక్, చైనా మంజా, నైలాన్ దారాలను వినియోగిస్తున్నారని, ఇవి పాదాచారులకు, బైక్ నడుపుతున్న వారికి మెడకు తగులుకుని ప్రాణాంతకంగా మారుతున్నాయని చెప్పారు. వాదనల అనంతరం.. గతంలో మంజాపై నిషేధం విధిస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని జస్టిస్ విజయసేన్‌రెడ్డి ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేశారు.