ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీష్ రెడ్డి

Energy Minister fires salvo on opposition leaders. రాష్ట్ర అప్పులపై నల్గొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు

By Medi Samrat  Published on  26 July 2022 4:15 PM GMT
ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్ర అప్పులపై నల్గొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంగళవారం ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తలసరి ఆదాయం విపరీతంగా పెరిగిందని అన్నారు. మీడియాతో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో ఆస్తులు పెరిగి ప్రజల ఆదాయం మెరుగుపడిందన్నారు. 2021-22లో దేశంలో తలసరి ఆదాయం తగ్గిందని, తెలంగాణలో మాత్రం అది పెరిగిందని ఆయన సూచించారు. దేశంలోని సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో నాయ‌కులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలపై మండిపడ్డారు. అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ట్రెండింగ్‌లో నిలిచేందుకు పోటీ పడుతున్నార‌ని.. ప్రజా సమస్యలేమీ లేవని ప్రతిపక్ష నేతలు మన ముఖ్యమంత్రిపై బురదజల్లుతున్నారని ఫైర్ అయ్యారు. అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులపై కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో మాట్లాడి.. కేంద్రం చేసిన‌ అప్పులు ఆస్తులుగా ఎందుకు మార్చారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను చూపించి టీఆర్‌ఎస్ నేతలను బెదిరించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రశేఖరరావు మచ్చలేని నాయకుడని, ఆయన్ను ఎవరూ తాకడం సాధ్యం కాదని అన్నారు. ఉమ్మడి ఏపీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు మండలాల మనోభావాలు, కోరికలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రభుత్వ కుట్రతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. తెలంగాణ, ఏపీలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను పోల్చి చూసిన ఈ ఏడు మండలాల ప్రజలు విభజనపై తమ ఆకాంక్షను వ్యక్తం చేశారని ఆయ‌న అన్నారు.













Next Story