రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ.. తాజాగా మరి కొంతమందిని విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. క్యాసినో వ్యవహారం కేసులో ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను విచారిస్తున్న ఈడీ.. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు నోటీసులు ఇచ్చింది. రమణతో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి క్యాసినో వ్యవహారం కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సీనియర్ రాజకీయవేత్త ఎల్.రమణకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో ఎల్ రమణకు ఈడీ అధికారులు సూచించారు. చీకోటి ప్రవీణ్ ను పలుమార్లు ప్రశ్నించిన ఈడీ ఆధికారులు బుధవారం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సోదరులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను విచారిస్తున్నారు.