ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 March 2024 10:07 AM GMT
ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. BRS నాయకురాలిని 2023లో ఈడీ ప్రశ్నించింది. కవిత ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సంయుక్తంగా సోదాలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు తనిఖీలు జరుపుతున్నాయి. నాలుగు బృందాలుగా ఈడీ, ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో కవితకు బలవంతపు చర్య నుండి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28, 2024న మార్చి 13 వరకు పొడిగించింది. గతంలో ఆమె విచారణ సమయంలో, కవిత తన మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్ల, అరుణ్ రామచంద్ర పిళ్లై వాంగ్మూలాలపై కూడా ప్రశ్నలు ఎదుర్కొన్నారు. బుచ్చిబాబును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫిబ్రవరిలో అరెస్టు చేయగా, పిళ్లైని గతేడాది మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. ఐటీ, ఈడీ సోదాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కవితతోపాటు ఆమె భర్త వ్యాపారాలపై దర్యాప్తు సంస్థ అధికారుల ఆరా తీస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారత రాష్ట్ర సమితి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన విజయ్‌ నాయర్‌ ఆప్‌ నాయకుల తరఫున సౌత్‌ గ్రూప్‌ (శరత్‌రెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రణలో ఉంది) అనే గ్రూప్‌ నుంచి కనీసం రూ. 100 కోట్ల ముడుపులు అందుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఆప్ నేత మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఫిబ్రవరి 26, 2023న స్కామ్ లో కీలక పాత్ర పోషించినందుకు అరెస్టు చేసింది.

ప్రస్తుత దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story