ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు ఊహించని షాక్
ED attaches assets worth Rs 80.65 Cr of TRS MP Nama Nageshwar Rao. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Oct 2022 2:15 PM GMTతెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం షాకిచ్చింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయం సహా సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను జప్తు చేసింది. వీటి విలువ రూ.80.65 కోట్లుగా ఈడీ వెల్లడించింది. నామా ఆధ్వర్యంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ రుణాల పేరిట మోసానికి పాల్పడిందంటూ ఇదివరకే ఈడీ కేసు నమోదు చేసింది. నామా కంపెనీల్లో సోదాలు చేపట్టిన ఈడీ గతంలోనే రూ.67 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసమంటూ రుణాలు తీసుకున్న మధుకాన్ ఆ నిధుల్లో రూ.362 కోట్లను దారి మళ్లించినట్లు గుర్తించామని ఈడీ వెల్లడించింది. నామా నాగేశ్వరరావు, నామా సీతయ్యలు 6 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా కూడా గుర్తించామని ఆ సంస్థ తెలిపింది. మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్ ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో ఆ సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది.
టీడీపీ నుంచి టీఆర్‌ఎస్ ఎంపీగా మారిన నామా నాగేశ్వర్‌రావు మధుకాన్ గ్రూప్ కంపెనీల ప్రమోటర్, డైరెక్టర్‌గా ఉండడంతోపాటు కంపెనీ డిఫాల్ట్ చేసిన బ్యాంకు రుణానికి వ్యక్తిగత పూచీదారుగా ఉన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయం, నివాస ఆస్తులను ఈడి అధికారులు అటాచ్ చేశారు. ఆస్తుల అటాచ్‌మెంట్ రెండో రౌండ్‌లో ఈడీ స్థిరాస్తులను గుర్తించి అటాచ్ చేసింది.
జార్ఖండ్‌లోని రాంచీ నుంచి జంషెడ్‌పూర్ వరకు 163 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మించేందుకు 2011లో నామా నాగేశ్వర్‌రావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి కాంట్రాక్టు దక్కించుకుంది. కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,030 కోట్ల రుణం పొందింది. నిర్ణీత సమయంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదు. 50.24 శాతం మాత్రమే పూర్తీ చేసింది. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. రోడ్డు నిర్మాణం నిమిత్తం 90 శాతం మేర రుణం పొంది నిర్మాణ పనులు ఆపేసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో రూ.73.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లుగా ఈడీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు కింద బ్యాంకు రుణాలుగా తీసుకున్న రూ.361.29 కోట్లను దారి మళ్ళించినట్లుగా ఈడీ కేసు నమోదు చేసింది.