తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిన్న ముఖ్య‌మంత్రి స‌హా మంత్రులు మంత్రివ‌ర్గ స‌మావేశానికి ఈసీ అనుమ‌తి కోసం వేచి చూడ‌గా..

By Medi Samrat  Published on  19 May 2024 3:11 PM IST
తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిన్న ముఖ్య‌మంత్రి స‌హా మంత్రులు మంత్రివ‌ర్గ స‌మావేశానికి ఈసీ అనుమ‌తి కోసం వేచి చూడ‌గా.. నేడు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడానికి ECI షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, పంట రుణాల మాఫీపై చర్చను జూన్ 4వ తేదీకి వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ భేటీలో అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని సీఈసీ సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలావుంటే.. ముఖ్యమంత్రి మినహా చాలా మంది మంత్రులు శ‌నివారం మధ్యాహ్నం సచివాలయానికి చేరుకుని సాయంత్రం 7 గంటల వరకు ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచి చూశారు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంత్రులు సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల సంఘం అనుమతి కోసం సోమవారం వరకు వేచి చూస్తామని మంత్రులు తెలిపారు. అప్పటికీ స్పందన రాకపోతే ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశమై కేబినెట్ సమావేశానికి అనుమతి కోరాలని ప్లాన్ చేశామ‌న్నారు. వ్యవసాయ రుణాల మాఫీ, వరి సేకరణ, ఖరీఫ్‌ సీజన్‌ ప్రణాళిక, అకాల వర్షాల వల్ల పంటలు నాశనమవడంతోపాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం అవసరమని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది.

Next Story