ఆదిలాబాద్ జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. బుధవారం రాత్రి 11.23 గంటల సమయంలో ఉట్నూరు మండల కేంద్రంలో స్వల్పంగా భూమికి కంపించింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో.. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి లేచ్చారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. భూకంపం ధాటికి ఇళ్లలోని వస్తువులు కదిలిపోయాయని చెప్పారు. కొన్ని ఇళ్లలో సామాగ్రి మొత్తం చెల్లాచెదురుగా పడిపోయాయి.
భూకంప భయంతో ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. కాగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైందని అధికారులు తెలిపారు. ఉట్నూరు మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని, భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులు భూకంపం వచ్చినట్లు వెల్లడించారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. గతంలోనూ ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, కండెం మండలాల్లో భూకంపాలు వచ్చాయి.