డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను ఈ నెల 5 వ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి విడుదల చేశారు. దసరా పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 9 వ తేదీన వారందరికీ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు.
సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. నిర్ధేశించిన గడువులోగా సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 9090 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిందని విద్యా శాఖ అధికారులు సీఎంకు వివరించారు.
ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యేవారు విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు, టెట్, డీఎస్సీ, కుల, 1 నుంచి 7 తరగతుల స్టడీ సర్టిఫికెట్‌లను ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ పత్రాలను వెంట తీసుకువెళ్లాలని అధికారులు ఇప్పటికే సూచించారు. అలాగే పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్లో ఉంచిన ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూర్తిచేసి తమతోపాటు తీసుకువెళ్లాలని సూచించారు.