విషాదం.. గొంతులో ఆమ్లెట్ ఇరుక్కుని వ్యక్తి మృతి

Drunk man dies in Janagam after Omelette gets stuck in his throat. మద్యం సేవిస్తున్న సమయంలో గొంతులో ఆమ్లెట్‌ ఇరుక్కుపోవడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

By అంజి  Published on  4 Nov 2022 11:12 AM IST
విషాదం.. గొంతులో ఆమ్లెట్ ఇరుక్కుని వ్యక్తి మృతి

మద్యం సేవిస్తున్న సమయంలో గొంతులో ఆమ్లెట్‌ ఇరుక్కుపోవడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి అనే 38 ఏళ్ల వ్యక్తి.. లోకల్‌ వైన్‌షాపులో మందు కొనుగోలు చేసి.. అక్కడే ఉన్న పర్మిట్‌ రూమ్‌లో మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలోనే స్టఫ్‌ కోసం ఆమ్లెట్‌ ఆర్డర్‌ పెట్టాడు.

మద్యం సేవించిన తర్వాత ఆమ్లెట్‌ తింటున్న సమయంలో.. ఒక్కసారిగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక భూపాల్‌రెడ్డి చాలా ఇబ్బందిపడ్డాడు. పక్కనే ఉన్నవారు వెంటనే భూపాల్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. భూపాల్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో భూపాల్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story