తెలంగాణలో మహిళలపై పెరుగుతున్న గృహహింస
Domestic violence on the rise in Telangana. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని
By అంజి
తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నమోదవుతున్న నేరాల్లో సగం గృహహింసలే కావడం ఆందోళనకరం. దీంతో మహిళలు తమ ఇళ్లలోనే సురక్షితంగా లేరన్న విషయం స్పష్టమవుతోంది. ఇలాంటి సంఘటనలు యావత్ సమాజానికి ఆందోళన కలిగించేవి, ఖండించదగినవి.
గతంతో పోలిస్తే బాధితులు.. తమపై నేరాలకు పాల్పడితే ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రులు, బంధువులే కాకుండా తెలంగాణలో మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్‌లో 2022లో నమోదైన క్రైమ్ చార్టులో 181 హత్యలు, 2,126 అత్యాచారాలు, 40 వరకట్న హత్యలు, 126 వరకట్న మరణాలు, 4,946 గృహ హింస, 9,071 పరువు హత్యలు, 1418 ఇతర నేరాలు నమోదయ్యాయి.
షీ టీమ్స్ పలు కార్యక్రమాలు నిర్వహించి, అందులో బాలికల్లో అవగాహన పెంచుతున్నారు. దీంతో బాధిత బాలికలు, మహిళలు తమపై జరుగుతున్న నేరాలపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే కేసులు నమోదు చేసేందుకు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఈమెయిల్‌తో పాటు క్యూఆర్ కోడ్ స్కానింగ్ కూడా అందించారు. దీంతో కేసులు నమోదు చేసే ధోరణి కూడా పెరిగింది.
గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు 3.8 శాతం పెరగడం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 2021లో 17,253 నేరాలు నమోదైతే, 2022లో 17,908 నేరాలు నమోదయ్యాయి. గృహ హింస కేసులు 8 శాతం పెరిగాయి. దాంపత్య సమస్యలపై గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2021తో పోలిస్తే, 2022 సంవత్సరంలో 40 శాతం పెరుగుదల నమోదైంది. దీని కారణంగా గృహ హింస ఘటనలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ఈ దారుణాలపై పోలీసులు కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదైన వెంటనే విచారణ, సాక్ష్యాధారాలు సేకరించడం, ఛార్జిషీట్లు దాఖలు చేయడం, కోర్టుల్లో సాక్షులను హాజరుపరచడం వంటి అంశాల్లో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది.