తెలంగాణ రాష్ట్రం గత ఐదేళ్లలో భారీగా అప్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐదేళ్లలో తెలంగాణ అప్పులు 94.75 శాతం పెరిగాయని లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు, వెంకటేశ్, రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2018లో రూ. లక్ష 60 వేల 296.3 కోట్ల వరకు ఉన్న అప్పులు 2022 నాటికి రూ.3 లక్షల 12వేల 191.3 కోట్లకు చేరినట్టు కేంద్రం తెలిపింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం వెల్లడించింది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా.. 2022 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులే ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం తెలంగాణకు రూ.2,67,530 కోట్ల అప్పు ఉన్నట్లు కేంద్రం తెలిపింది.