హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోందని మాజీమంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ పతనం ప్రారంభమయ్యిందనడానికి హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని అన్నారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి జరిగిన పోరులో ఆత్మగౌరవం విజయం సాధించిందని అన్నారు. దళిత బందు పథకం లాంచ్ చేసిన గ్రామంలో బీజేపీ ముందంజలో ఉందని.. ప్రజల నమ్మకాన్ని టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం కోల్పోయిందని అన్నారు. వేలకోట్ల పథకాలకు జీఓ లు ఇచ్చినా ప్రజలు నమ్మలేదని.. 6 వేల నుంచి 10 వేలు పేట్టి ఓట్లు కొన్నా లాభం లేకుండా పోయిందని అన్నారు.
డబ్బులు పంచి ఓట్లు కొనాలని అనుకున్న.. హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవం వైపే నిలబడ్డారని డీకే అరుణ అన్నారు. ఈ హుజూరాబాద్ ప్రజలకు సెల్యూట్ చేశారు. అధికార యంత్రాంగాన్ని అంతా కూడా రంగంలోకి దింపినా ఫలితం లేదని.. హుజూరాబాద్ ప్రజల తీర్పు చారిత్రాత్మకం అని అన్నారు. హుజూరాబాద్ తీర్పు ఒక కనువిప్పు అని.. అభ్యర్థి ఎవరో తెలియనట్లుగా కేసీఆర్ రంగంలోకి దిగారని.. కేసీఆర్ ను ప్రజలు ఓడించారని అన్నారు. తెలంగాణ మొత్తం హుజూరాబాద్ తీర్పును కోరుకుంటుందని.. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.