Heavy Rains : కలెక్టర్లు స్కూల్ హాలిడేస్‌ ప్రకటించేయొచ్చు..!

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మానవ ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను కోరారు

By Medi Samrat  Published on  31 Aug 2024 2:19 PM GMT
Heavy Rains : కలెక్టర్లు స్కూల్ హాలిడేస్‌ ప్రకటించేయొచ్చు..!

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మానవ ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను కోరారు. కృష్ణా, గోదావరి నదుల లోతట్టు ప్రాంతాల పరిధిలోని జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురై స్థానికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండడంతో, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన శాంతికుమారి ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తీసుకోవలసిన నివారణ చర్యలపై చర్చించారు. తెలంగాణలోని పలు ప్రాంతాలు, సరిహద్దుల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయం, జీహెచ్‌ఎంసీ, సచివాలయంలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.

ఆయా జిల్లాల్లో వర్షాల పరిస్థితిని బట్టి పాఠశాలలకు సెలవు ప్రకటించడంపై కలెక్టర్లు తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. వర్షపు నీటితో ప్రజలు ప్రభావితమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు లేదా సహాయక కేంద్రాలకు తరలించడానికి ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రజలకు పలు కమ్యూనికేషన్ మోడ్‌ల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.

Next Story