రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ

Distribution of Bathukamma sarees to begin from Thursday. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుంది.

By అంజి  Published on  21 Sep 2022 11:40 AM GMT
రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుంది. 2017లో ప్రారంభించిన వార్షిక పంపిణీ కార్యక్రమం కింద రాష్ట్రంలోని దాదాపు కోటి మంది మహిళలు దసరా పండుగ సందర్భంగా చీరలను అందుకోనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్న మహిళలకు 5.81 కోట్ల చీరలను పంపిణీ చేసింది. ఈ ఏడాది దాదాపు రూ.339.71 కోట్లు ఖర్చు చేశారు.

జౌళి, చేనేత శాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ పథకం పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మహిళలకు చీరలను బహుమతిగా అందించడమే కాకుండా, రాష్ట్రంలోని నేత కార్మికులకు జీవనోపాధిని కల్పిస్తుందని అన్నారు. పూర్వపు ఆంధ్రప్రదేశ్‌లో తమ కుటుంబాల పోషణ కోసం నేత కార్మికులు కష్టాలు పడ్డారు, కానీ ఇప్పుడు వారి ఆదాయం రెండింతలు పెరిగిందని అన్నారు.

''నేత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ద్వారా వస్త్ర పరిశ్రమను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుండగా, కేంద్రం మాత్రం నేత కార్మికుల పురోగతిని దెబ్బతీసే వస్త్రాలపై జీఎస్టీని పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు కేంద్రం మొగ్గు చూపనప్పటికీ, వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటోంది'' అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

చీరలన్నీ ఇప్పటికే గమ్యస్థానాలకు చేరుకోగా, పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ చీరలను సిరిసిల్లలో 20,000 మంది పవర్‌లూమ్ నేత కార్మికులు తయారు చేశారు. ప్రతి రోజు, గడువుకు అనుగుణంగా సుమారు లక్ష చీరలు తయారు చేయబడ్డాయి. కొరత లేకుండా చూసేందుకు 3 లక్షల చీరల బఫర్ స్టాక్‌ను నిర్వహించడం జరిగింది.

100 శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలును ఉపయోగించి 24 డిజైన్లలో 10 రంగులు మరియు 240 థ్రెడ్ బార్డర్‌లలో చీరలు ఉత్పత్తి చేయబడ్డాయి. రాష్ట్రంలోని మహిళల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని డిజైన్లను ఖరారు చేశారు. కోటి చీరల్లో 6 మీటర్ల పొడవున్న 92 లక్షల చీరలను తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు పంపిణీ చేయనున్నారు . 9 మీటర్ల పొడవున్న మిగిలిన ఎనిమిది లక్షల చీరలను ప్రత్యేకంగా వృద్ధ మహిళల కోసం వారి ప్రాధాన్యత మేరకు తయారు చేశారు.

Next Story
Share it