93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలోని 93 లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.

By Knakam Karthik
Published on : 12 Feb 2025 5:24 PM IST

Telangana, Congress Government, Digital connectivity, CM Revanth, Minister Sridhar Babu

93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలోని 93 లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. టీ-ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించినట్లు బుధవారం సచివాయంలో తనను కలిసిన వరల్డ్ బ్యాంకు ప్రతినిధి బృందానికి శ్రీధర్ బాబు వివరించారు. పైలట్ ప్రాజెక్టు కింద డిజిటలైజేషన్ చేపట్టిన నాలుగు గ్రామాలను ఈ బృందం సందర్శించి తమ అనుభవాలను మంత్రితో పంచుకున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని హాజిపల్లి, నారాయణపేట జిల్లాలోని మద్దూర్, సంగారెడ్డి జిల్లాలోని సంగుపేట, పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్ గ్రామాల్లో ఇంటర్నెట్ కనిక్టివిటీ వల్ల స్థానికులకు కలిగిన ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు వైజంతీ దేశాయ్, కింబర్లీ జాన్ ఆధ్వర్యంలోని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం వెల్లడించింది. మరో మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు కనెక్టివిటీ విస్తరించాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ఆ ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 32 వేల కిలోమీటర్ల పొడవున ఫైబర్ నెట్ ఆప్టిక్ కేబుల్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.



Next Story