గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్ : 19 జిల్లాల్లో డయాగ్నోసిస్ సెంటర్లు
Diagnostic Centers In telangana Districts. తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో
By Medi Samrat Published on 5 Jun 2021 3:57 PM ISTతెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 డయాగ్నోసిస్ సెంటర్లను జూన్ 7న ప్రారంభించాలని సీఎ కేసీఆర్ నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్ జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని, ఈమేరకు ఇవాళ వైద్య అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఇవాళ వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, పలు అంశాల మీద అధికారులతో సీఎం చర్చించారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్షా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా వున్నాయనే విషయాన్ని, వైద్యాధికారులు తన దృష్టికి తెచ్చిన నేపథ్యంలో, వాటిని సోమవారం నుంచి ప్రారంభించాలని సీఎం వైద్యాధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామన్నారు. ప్రజలకు ఉచిత వైద్యకోసం ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. గత పాలనలో ఆగమైన వైద్య రంగాన్ని అనతికాలంలోనే ప్రభుత్వం పునరుజ్జీవింప చేసిందన్నారు.
సామాన్యుడికి వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేస్తున్నదన్నారు. వైద్యంలో అత్యంత కీలకమైన డయాగ్నోసిస్ కేంద్రాలను తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని తెలిపారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధంగా వున్న 19 కేంద్రాల్లోని డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని సీఎం తెలిపారు.