తెలంగాణలో రాత్రి కర్ఫ్యూపై డీహెచ్ ఏం చెప్పారంటే
DH Srinivasa Rao says no need of Night Curfew in state.కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2022 12:41 PM ISTకరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు విధించడంతో పాటు, రాత్రి కర్ఫ్యూని విధించాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జనం గుమిగూడకుండా ఈనెల(జనవరి 31) వరకు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాత్రి కర్ఫ్యూని విధిస్తారు అనే వార్తలు వస్తున్నాయి.
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా వ్యాప్తి లేదని వైద్యారోగ్య శాఖ డీహెచ్ డాక్టర్.శ్రీనివాసరావు తెలిపారు. కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం దాటితేనే రాత్రి కర్ఫ్యూ అవసరం అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 గా ఉందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానానికి ఆరోగ్యశాఖ నివేదికను అందజేసింది. ఈ క్రమంలో మీడియాతో డీహెచ్ మాట్లాడారు.
రాష్ట్రంలో అత్యధిక పాజిటివిటీ రేటు మెదక్ జిల్లాలో 6.45శాతంగా నమోదు కాగా.. అతి తక్కుగా ఖమ్మం జిల్లాలో 1.14శాతంగా నమోదు అయినట్లు చెప్పారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో 4.26 శాతం, మేడ్చల్‌లో 4.22 శాతంగా ఉందన్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో లక్షకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి జ్వర సర్వే జరుగుతుందని.. మూడు రోజుల్లోనే 1.78లక్షల మందికి కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. 15 నుంచి 18 ఏళ్లు వారిలో 59శాతం మందికి టీకా అందించినట్లు వెల్లడించారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,980 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని సోమవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,38,795కి చేరింది. కరోనాతో ముగ్గురు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,075కు చేరింది. 2,398 మంది కోలుకోగా.. ఇప్పటివరకూ ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 7,01,047కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 33,673 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.