తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని డీజీపీ అంజనీ కుమార్ అప్రమత్తం చేశారు. రానున్న 48 గంటలలో రాష్టంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ కూడా పాల్గొన్నారు.
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో ఉంటారని.. సహాయం కోసం డయల్100కి లేదా స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందిన వెంటనే తగు సహాయక చర్యలు చేపడతామని అన్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ వాసులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ఈ మేరకు నగరంలో హైఅలర్ట్ జారీ చేసింది. నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఏదైనా అవసరమైతే 9000113667, 040-21111111 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.