ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారు : భట్టి విక్రమార్క
భారతదేశాన్ని అస్థిరపరచాలి, దేశాన్ని విభాజించాలి అనుకునేవాళ్లు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 12:50 PM ISTభారతదేశాన్ని అస్థిరపరచాలి, దేశాన్ని విభాజించాలి అనుకునేవాళ్లు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఇందిరా గాంధీ జీవిత చరిత్ర గురించి అవగాహన కలిగిన వాళ్ళు చేతులెత్తి ఇందిరాగాంధీని నమస్కరిస్తారు. దేశ ప్రజలందరికీ సమానత్వం కల్పించాలని భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, 20 సూత్రాల అమలుతో సమ సమాజానికి పునాదులు వేసిన ప్రధాని ఇందిరాగాంధీ అన్నారు. విదేశీ విధానంలో ఔనత్యాన్ని తీసుకువచ్చి ప్రపంచంలో భారత దేశాన్ని గొప్ప దేశంగా నిలబెట్టిన ప్రధాని ఇందిరాగాంధీదిగా కొనియాడారు.
దేశం కోసం జాతి కోసం నిత్యం పరితపించిన ప్రజా నాయకురాలు ఇందిరాగాంధీ.. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సమూహాలను అనేక వర్గాల ప్రజలను కలిసికట్టుగా ఉంచి జాతిని ఏకతాటిపై నడిపిన ధీరోదాత్త ఇందిరాగాంధీ.. నా ప్రాణం కంటే కూడా ఈ దేశం ముఖ్యం.. ఈ దేశ సుస్థిరత కోసం నా చివరి రక్తపు బొట్టు ఉపయోగపడుతుందని చాటి చెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ.. ఇందిరా గాంధీ భారత దేశంలో పుట్టడం దేశ ప్రజలందరికీ గర్వకారణం అన్నారు.
అనేక సంస్థలు తీసుకువచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఇందిరా గాంధీ మార్గాన్ని ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్నదని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అభివృద్ధిలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పాం. ఈ ఏడాది కాలంలో చేసి చూపిస్తున్నామన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ ఈ దేశంలో కులగణన సర్వే జరగాలని ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కుల గణన సర్వేను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో కులగణన నిబద్ధతతో, శాస్త్రీయంగా జరుగుతున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం తయారు చేసే ప్రణాళికలకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు.
కుల గణన సర్వే పూర్తి తర్వాత ప్రజా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో దేశానికి ఈరాష్ట్రం రోల్ మోడల్ గా ఉండబోతుందన్నారు. ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవిస్తుంది. అసెంబ్లీలో ప్రమాణం చేసిన గంటలోపే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణించే రవాణా డబ్బులను ప్రభుత్వం మహిళల తరఫున నెలకు 400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లిస్తున్నదన్నారు.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏడాదికి 20వేల కోట్ల రూపాయల రుణాలు వడ్డీ లేకుండా ఇస్తున్నామన్నారు. వడ్డీ లేని రుణాలతో మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రజా ప్రభుత్వం తీర్చిదిద్దునుందన్నారు. ఇందిరాగాంధీ ఆలోచనలను ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే లగచర్లలో అమాయకమైన రైతులను రెచ్చగొట్టి కుట్రపూరితంగా అధికారులపై దాడి చేయించారు. మీలాగా రైతుల నుంచి బలవంతంగా భూములను ప్రజా ప్రభుత్వం లాక్కోవడం లేదన్నారు. రాష్ట్రంలో అసైన్ చేసిన 24 లక్షల ఎకరాల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పదివేల ఎకరాలకు పైబడి రైతుల నుంచి బలవంతంగా గుంజుకొని లే అవుట్ చేసి అమ్ముకున్న దుర్మార్గులు.. రైతుల భూములను బలవంతంగా గుంజుకొని ఆక్షన్ వేసి పైశాచిక ఆనందం పొందిన మీరు రైతుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. లగచర్లలో హింసను ప్రేరేపించి దాడులకు పురిగొల్పుతున్నది మీరు.. అభివృద్ధి జరగాలని ఆలోచన చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.