హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ''గ్రామసభలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ప్రజా పాలనలో ప్రజలందరి సమక్షంలోనే నిర్ణయాలు తీసుకుంటాం. గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను తయారు చేస్తారు'' అని భట్టి తెలిపారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా సాయం అందిస్తామని వెల్లడించారు.
భూమి లేని నిరుపేదలకు ఖాతాల్లో ఏటా రూ.12 వేలు జమ చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఖమ్మం జిల్లా బనిగండ్లపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అలాగే అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాములను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. పలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.