హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.12,000 చొప్పున ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 28 నుండి ఈ పథకం ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2 విడతల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. అందులో భాగంగా డిసెంబర్ 28న తొలివిడత అందిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. 10 సంవత్సరాల కాలంలో ప్రత్యక్షంగా పరోక్షంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం 7,11,911 కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలపై భారం వేసిందన్నారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో భట్టి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
సంక్రాంతి నుండి రైతులకు రైతు భరోసా అందిస్తామని భట్టి ప్రకటించారు. వ్యవసాయానికి ఏడాదిలో రూ.50,953 కోట్లు ఖర్చు పెట్టిన ప్రజా ప్రభుత్వం తమదని చెప్పారు. సన్న వడ్ల బోనస్ ద్వారా ఎకరాకు పది నుంచి పదిహేను వేల రూపాయలు అదనంగా లబ్ధి చేకూర్చామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రెండు లక్షల రుణాలు ఉన్న రైతులందరికీ కేవలం 15 రోజుల్లోనే వారి ఖాతాల్లో నేరుగా 21 వేల కోట్ల రూపాయలను జమ చేసి దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచిందన్నారు. గత ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని పూర్తిగా విస్మరించగా ప్రజా ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయలు చెల్లించిందని తెలిపారు.