పేదలకు జీ+2 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు..డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు
By - Knakam Karthik |
పేదలకు జీ+2 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు..డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తున్నట్లే పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు జీ ప్లస్ టూ టవర్స్‌తో నిర్మించి పేదలకు కేటాయిస్తామని తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన భట్టి పలు అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒకపక్క ఏరు.. మరోపక్క చెరువుతో మధిర విస్తరణ సమస్యను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ప్రజలు మాత్రం మధిరలో నివసించేందుకు పోటీ పడుతున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామన్నారు. భూ సేకరణకు నిధులు కేటాయించామని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
వర్షం రాగానే కరెంటు స్తంభాలపై చెట్లు పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్టే మధిర పట్టణంలోని పేదలు నివసించడానికి జీ+2 టవర్స్‌తో హౌసింగ్ కాలనీ నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. అతి త్వరలోనే ఈ కార్యక్రమానికి భూమి పూజ చేస్తానని హామీ ఇచ్చారు. మధిర పట్టణం మన అందరిదని, పట్టణానికి సమీపంలో బందరు పోర్టు, అమరావతి నగరం, రైల్వే లైన్ ఉండటంతో వస్తువులన్నిటినీ సులభంగా రవాణా చేసుకునే అవకాశం ఉందని తెలపారు.