పచ్చని కోనసీమకు దిష్టి తగిలింది

‘కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.

By -  Medi Samrat
Published on : 26 Nov 2025 9:20 PM IST

పచ్చని కోనసీమకు దిష్టి తగిలింది

‘కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్లు రోడ్డున పడకూడదు. కొబ్బరి రైతు రోడ్డు ఎక్కకూడదు. కోనసీమ కొబ్బరి రైతాంగం సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందిస్తామ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి రైతులకు భరోసా ఇచ్చారు. 45 రోజుల్లో కొబ్బరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని, సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ తో మీ ముందుకు వస్తానని తెలిపారు. కోనసీమ కొబ్బరి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు. మోడుబారిన కొబ్బరి చెట్ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. తలలు వాల్చేసిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. శంకరగుప్తం డ్రెయిన్ సమస్య ఎన్నేళ్లుగా ఉంది? సమస్య ఎప్పటి నుంచి తీవ్రమైంది? శంకరగుప్తం డ్రెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది? డ్రెయిన్ ఏమైనా ఆక్రమణలకు గురైందా అన్న వివరాలపై జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ , ఉద్యాన శాఖ అధికారులను ఆరా తీశారు. కొబ్బరి తోటలకు తిరిగి పునరుజ్జీవం పోసే అంశంపై శాస్త్రవేత్తలతో చర్చించారు. అనంతరం పంటలు నష్టపోయిన 13 గ్రామాల ప్రజలతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కోనసీమ ప్రాంతంలో గతంలో పర్యటించిన సందర్భంలో శంకరగుప్తం డ్రెయిన్ సమస్య ఇంత తీవ్రంగా లేదు. సమస్య నా దృష్టికి వచ్చిన తర్వాత సమగ్ర అధ్యయనం జరిపి శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించాలని భావించా. మోడు బారుతున్న కొబ్బరి చెట్లకు పునరుజ్జీవం పోయగలమా లేదా? కొత్తగా చెట్లు నాటితే ఎన్నేళ్లకు పంటకు వస్తాయి? ఈ లోపు రైతులకు ఉపాధిపరంగా ఏం చేయగలం? తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక అవసరం. సమస్యపై మూలాల నుంచి అవగాహన తెచ్చుకుంటే తప్ప శాశ్వత పరిష్కారం వెతకలేం.

ఇది గత ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డ్రెయిన్లు, పంట కాలువల ఆధునీకరణకు రూ. 4 వేల కోట్లు అవసరం అని అధికారులు తెలియజేశారు. శంకరగుప్తం డ్రెయిన్ కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టేందుకు రూ. 20.62 కోట్లు అవసరం ఉంది. 50 మీటర్లు ఉన్న డ్రెయిన్ గత ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాంతాల్లో మూడు మీటర్లకు కుచించుకుపోయింది. కొన్ని చోట్ల డ్రెయిన్ ఆక్రమణలకు గురయ్యింది. కొన్ని చోట్ల అక్రమంగా ప్రవాహానికి అడ్డుకట్టలు వేశారు. దీనివల్ల సముద్రo పోటెత్తినప్పుడు నీరు పంట పొలాల్లోకి చొచ్చుకు వచ్చింది. జీవవైవిధ్యాన్ని దెబ్బ తీసింది. దీనివల్ల కోనసీమ కొబ్బరి తోటలకు మాత్రమే కాదు తీర ప్రాంతానికి కూడా ముప్పు పొంచి ఉందని నీటిపారుదల విభాగం నిపుణులు బి.సి. రోశయ్య నివేదిక చెబుతోంది. ఇది మనిషి సృష్టించిన విధ్వంసం.

గత ఐదేళ్లలో కనీసం పూడిక తీయలేదు

గత పాలకులు గడచిన అయిదేళ్ల కాలంలో శంకరగుప్తం డ్రెయిన్ లో కనీసం పూడిక తీయలేదు. ఒక్క ఇంచి కూడా మట్టి తీయలేదు. ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి అవసరం. గత ప్రభుత్వం కనీసం రోడ్డు మీద గుంతలు కూడా పూడ్చలేదు. డబ్బు ఎడాపెడా ఖర్చు చేసేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ముంచేసింది. ఎక్కడా ఒక విధానం పాటించలేదు. ఇటీవల సచివాలయం ఉద్యోగుల ప్రమోషన్ల అంశంపై చర్చిస్తే ఆ ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం కనీసం సర్వీస్ రూల్స్ పాటించలేదన్న విషయం బయటపడింది. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ రాష్ట్రాన్ని ఆర్ధికంగా బలోపేతం చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. రోడ్లు వేయాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. విపత్తులు సంభవించినప్పుడు పరిహారం ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం సంక్షేమంతోపాటు అభివృద్ధికీ ప్రాధాన్యత ఇస్తుంది. గత ప్రభుత్వం కనీసం ఉద్యోగులకి సమయానికి జీతాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వ తాలూకు లోటుని పూడ్చే ప్రయత్నం చేస్తున్నాం. మేము బాధ్యతగా ఉన్నాం.

పచ్చని కోనసీమకు దిష్టి తగిలింది

పచ్చని కోనసీమకు దిష్టి తగిలింది. ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చిందేమో? మోడువారిన కొబ్బరి చెట్లను చూస్తుంటే ఎదిగిన కొడుకు మొండెంతో నిలబడినట్టు ఉంటుంది. ఎదిగిన కొడుకు ఎంత సంపాదిస్తాడో తెలియదు. ఎదిగిన కొబ్బరి చెట్టు మాత్రం ఆదాయం ఇస్తుంది. ఎకరం భూమిలో కొబ్బరి తోట ఉంటే రూ. 2 లక్షల ఆదాయం వస్తుంది. కొబ్బరి రైతుకు ఆ ఆదాయం శాశ్వతం కావాలి. 14 ఏళ్లుగా శంకరగుప్తం డ్రెయిన్ సమస్య ఉంది. 14 రోజుల్లో పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం. చికిత్స కంటే నివారణ మేలు అన్న పెద్దల మాటను ఆచరణలో పెట్టేవాడిని. శంకరగుప్తం డ్రెయిన్ సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపుతాం.

బి.సి. రోశయ్య రిపోర్టుపై అధ్యయనం

కోనసీమ ప్రాంతంలో డ్రెయిన్లపై నీటిపారుదలశాఖ నిపుణులు బి.సి. రోశయ్య రాసిన రిపోర్టును అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తాం. రెండు వారాల్లో అధికారులు ఈ రిపోర్టుపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలి. డిసెంబర్ 2వ వారంలో ఈ సమస్యపై అధికారులు, రైతులతో మరో సమావేశం నిర్వహిస్తాం. శంకరగుప్తం డ్రెయిన్ బాధిత కొబ్బరి రైతుల సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన తక్షణ ఉపసమనచర్యలపై చర్చిస్తాం. ఒక నివేదిక సిద్ధం చేసి మంత్రివర్గం ముందుంచుతాం. సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం.

కొబ్బరి రైతుల సమస్యలపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ

మీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మాటలు చెప్పి మభ్యపెట్టేందుకు రాలేదు. కొబ్బరి రైతుకు అండగా ఉండేందుకే ఇక్కడికి వచ్చాను. 45 రోజుల్లో కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తాం. సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం. ఈలోపు అధికారులు, కొబ్బరి రైతులతో మరో రెండు సమావేశాలు నిర్వహిస్తాం. 14 రోజుల తర్వాత తదుపరి సమావేశం నిర్వహిస్తాం. డ్రెయిన్ లో ఆక్రమణలు ఎంత ఉన్నాయి? గట్టు ఎంత మేర దెబ్బ తింది? ఏ మేరకు పూడిక ఉంది? అనే అంశాలతో పాటు బి.సి. రోశయ్య రిపోర్టుపై కూడా అధ్యయనం చేసి నివేదిక రూపొందించండి. ముఖ్యమంత్రి కార్యాలయానికి సమస్య తీవ్రత తెలియజేసి పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు ప్రత్యేక కమిటీ వేద్దాం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేద్దాం.

కేంద్రం దృష్టికి కొబ్బరి రైతుల సమస్యలు

కోనసీమ ప్రాంతంలో లక్ష ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతోంది. ఇక్కడ కోకోనట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం మాత్రమే ఉంది. కోనసీమలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం. ఓఎన్జీసీ కార్యకలాపాలు కూడా సమస్యకు కారణం అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. స్థానిక పార్లమెంటు సభ్యులతో సహా మనకు 21 మంది ఎంపీలు ఉన్నారు. వారితో కలసి కోనసీమ కొబ్బరి రైతుల సమస్యను కేంద్రం ముందు ఉంచుతాం. సమస్య మూలాలు వెతికి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాము.

రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తుంది

ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తుంది. ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలి అన్నది కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు” అన్నారు.

Next Story