హైదరాబాద్: హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు భగవద్గీత స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భగవద్గీత స్ఫూర్తితోనే చెరువులను కాపాడుతున్నామని తెలిపారు. ధర్మం గెలుస్తుంది, అధర్మం ఓడిపోతుందని శ్రీకృష్ణుడు అన్నాడని, శ్రీకృష్ణుని బోధ ప్రకారం తాను ఈ కూల్చివేతలను చేపడుతున్నానని తెలిపారు. ప్రభావవంతమైన వ్యక్తులు ఈ ఫామ్ హౌస్‌లకు యజమానులుగా ఉన్నందున చాలా ఒత్తిడి ఉంది, అయితే ఇది భవిష్యత్తు తరాలకు సంబంధించిన అంశమన్నారు. కురుక్షేత్రంలో అర్జునుడి గందరగోళాన్ని ఇది చూసిస్తోందని అన్నారు.
అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలే తనకు స్ఫూర్తి అని సీఎం అన్నారు. హైదరాబాద్‌లో చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి వాటికి హైడ్రా ద్వారా విముక్తి కల్పిస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. హైదరాబాద్‌లో హరేకృష్ణ ఆధ్వర్యంలో అనంత శేష స్థాపన ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. చెరువులను ఆక్రమించినవారిని వదలమన్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గమని చెప్పారు. అక్రమ నిర్మాణాలు కూలుస్తామన్నారు. కబ్జాదారులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చని, చెరువుల కోసం వారి భరతం పడతామని సీఎం స్పష్టం చేశారు.
ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే అది ప్రజలపై ప్రకోపిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. చెన్నై, వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం కళ్లారా చూశామని, ఈ కూల్చివేతలకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. భవిష్యత్ తరాలకు సరస్సులు, నదులు, చెరువులను అందించాలనేది లక్ష్యమన్నారు. కొందరు శ్రీమంతులు చెరువుల్లో ఫాంహౌస్‌లు నిర్మించారని, వాటి డ్రైనేజీలను గండిపేటలో కలిపారని, వాళ్ల విలాసం కోసం వ్యర్థాలు చెరువులో కలుపుతారా? సీఎం ప్రశ్నించారు.