ఢిల్లీలో పాత వాహనాల వినియోగంపై నేటి నుంచి నిషేధం
దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది
By Knakam Karthik
ఢిల్లీలో పాత వాహనాల వినియోగంపై నేటి నుంచి నిషేధం
దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. వాతావరణ నాణ్యత మరింత దిగజారకూడదని నిర్ణయించిన అధికారులు, ఇవాళ్టి నుంచే (జులై 1) పాత వాహనాలపై నియంత్రణలు అమలు చేయనున్నారు. 10 ఏళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు, అలాగే 15 ఏళ్ల కంటే పాత పెట్రోల్ కార్లను అధికారులు సీజ్ చేయడం ప్రారంభిస్తారు. ఇప్పటికే పెద్దఎత్తున వాయు కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలను రోడ్లమీద నడవనీయడం సరి కాదన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే CNG వాహనాల విషయంలో కొంత సడలింపు ఇచ్చారు. 15 ఏళ్ల వయస్సు గల CNG కార్లను కూడా నిషేధించాలనే యోచన ఉన్నప్పటికి, ప్రస్తుతానికి వాటి యజమానులకు ఉపశమనం లభించింది.
మరోసారి నిర్ణయం తీసుకునే వరకు ఈ వాహనాలకు అనుమతి ఉంటుంది. ఇలా, ఈ కొత్త ఆంక్షలతో పాత డీజిల్, పెట్రోల్ వాహన యజమానులు పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ వాహనాలను త్వరగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఢిల్లీ వాసులు పరిశుద్ధ వాతావరణాన్ని అనుభవించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ చర్యలను తీసుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం కలిగించే ప్రభావం ఎంతగానో చర్చకు వస్తుంది.
గతంలోనే ఢిల్లీ వాయు కాలుష్యాన్ని సమూలంగా నియంత్రించేందుకు పలు చర్యలు తీసుకున్నప్పటికి అవి కొద్ది కాలానికి మాత్రమే మంచి ఫలితాలు ఇచ్చాయి. దీంతో ఈ సారి మాత్రం ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలను తీసుకుంది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఇప్పటికే ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, జూలై 1 నుండి పాత వాహనాలపై తీవ్రమైన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఇందులో భాగంగా, 10 ఏళ్ల పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలు బహిరంగ ప్రదేశాల్లో లేదా పెట్రోల్ పంపుల వద్ద నిలిపివుంటే, వాటిని అధికారులు స్వాధీనం చేసుకుంటారు. ఇకపై ఈ వాహనాల యజమానులకు పెనాల్టీ కూడా తప్పదు. పాత కార్ల యజమానులకు రూ.10,000 జరిమానా, ద్విచక్ర వాహన యజమానులకు రూ.5,000 జరిమానా విధించబడుతుంది. దీంతో పాత వాహనాలను కలిగిన వారు వాటిని రోడ్డుపై తీసుకురావడం కుదరదు.