ఎమ్మెల్సీ కవితకు బిగ్‌ షాక్‌.. బెయిల్‌ నిరాకరణ

ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కే.కవిత కోర్టును ఆశ్రయించగా.. ఆ రెండు పిటిషన్లు కోర్టు డిస్మిస్‌ చేసింది.

By అంజి  Published on  6 May 2024 12:51 PM IST
Delhi excise policy, BRS, K Kavitha, bail plea reject, Delhi

ఎమ్మెల్సీ కవితకు బిగ్‌ షాక్‌.. బెయిల్‌ నిరాకరణ

ఇప్పుడు రద్దు చేయబడిన ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ 2021-22 ఏర్పాటు, అమలులో అవకతవకలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులలో ఢిల్లీలోని రూస్ అవెన్యూ సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకురాలు కె కవితకు బెయిల్ నిరాకరించింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లను ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తిరస్కరించారు. ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించగా.. ఆ రెండు పిటిషన్లు కోర్టు డిస్మిస్‌ చేసింది. దీంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్‌ రిమాండ్‌ కింద తిహార్‌ జైలులో ఉన్నారు.

మద్యం కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో మార్చి 15న హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకురాలిని ఈడీ అరెస్ట్ చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా కవితపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని దక్షిణాదికి చెందిన కొంతమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా మార్చారని కేంద్ర ఏజెన్సీ ఆరోపించింది.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కే కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ సహచరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ఢిల్లీ మద్యం పాలసీలో పలువురు మద్యం వ్యాపారులు, ఇతరులను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. పాలసీలో అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ విచారణకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది.

ఏప్రిల్ 9న, ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి విడుదల కోసం చేసిన అభ్యర్థనను కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ ప్రతీకార వాదనను తిరస్కరించింది. ఇటీవలి పరిణామంలో, 2024 లోక్‌సభ ఎన్నికల కారణంగా అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై మే 7న వాదనలు వినవచ్చని సుప్రీంకోర్టు గత వారం శుక్రవారం తెలిపింది.

Next Story