ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరపున జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 8వ తేదీ ఉదయం 10.30 గంటలకు న్యాయమూర్తి కావేరి భవేజ బెయిల్‌పై తీర్పు వెల్లడించనున్నారు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలను ఏప్రిల్ 20కు వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది.
కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, సాక్షాలను ధ్వంసం చేస్తారని ఈడీ ఆరోపించింది. కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారని.. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ తరపున వాదించారు. ఇప్పటికే కవిత తనయుడికి 11 పరీక్షలలో 7 పరీక్షలు పూర్తి అయ్యాయి.. కొడుకు పరీక్షల ఒత్తిడికి గురవుతున్నాడన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు, వైద్య నివేదికలు లేవని ఈడీ తరపున వాదనలు వినిపించారు. ఇండో స్పిరిట్‌లో అరుణ్‌పిళ్లై, కవితకు 33 శాతం వాటా ఉందని.. కవిత తన ఫోన్లలో డేటాను డిలీట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఫార్మాట్ చేశారని ఆరోపించారు.