బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులు ఈ సభకు హాజరయ్యారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతోందని, ఇంకా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నామని వెల్లడించారు. మన తర్వాత స్వాతంత్ర్యం పొందిన జర్మనీ, సింగపూర్ వంటి దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. ఇక, ఢిల్లీలో తాము ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్ లను ప్రవేశపెట్టామని, ఈ మొహల్లా క్లినిక్ లను తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పరిశీలించారని కేజ్రీవాల్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీలో కూడా తీసుకువస్తామని చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న సమీకృత కలెక్టరేట్ కాన్సెప్టు చాలా మంచిదని, ప్రజలకు సంబంధించిన అన్ని పనులు ఒకేచోట జరుగుతాయని వివరించారు. గవర్నర్లు కేవలం కీలుబొమ్మల్లా తయారయ్యారని, మోదీ చెప్పినట్టల్లా ఆడుతున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. అభివృద్ధి పనులకు అడ్డుతగలడమే ఈ గవర్నర్ల పని అని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ స్కూళ్లు చూసిన తర్వాతే స్టాలిన్ తమిళనాడు బడులలో మార్పులు చేశారని కేజ్రీవాల్ అన్నారు. విద్యా, వైద్యం బాగుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.