తెలంగాణలో అమర రాజా భారీ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో అమర రాజా కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో....
By Medi Samrat Published on 3 Jan 2024 5:15 PM ISTతెలంగాణ రాష్ట్రంలో అమర రాజా కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో అమర రాజా కంపెనీ ఎండీ, గల్లా జయదేవ్ సమావేశమయ్యారు. తెలంగాణలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి గిగా ప్రాజెక్టును అమర రాజా కంపెనీ నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో గల్ల జయదేశ్ మాట్లాడారు.
తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి పథంలో అమర రాజా కీలక భాగస్వామి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఆ కంపెనీ తలపెట్టిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని.. అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ గిగా ఫ్యాక్టరీ, ప్యాక్ అసెంబ్లీ , ఇ పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్ ల నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అమర రాజా కంపెనీ ప్రాజెక్టు వేగంగా జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతుకు ఎండీ గల్లా జయదేవ్ సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో తమ ప్రాజెక్టును విస్తరించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.
అమర రాజా ఎనర్జీ ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థ. బ్యాటరీలకు సంబంధించి అతిపెద్ద తయారీదారులలో ఒకటి. ఈ కంపెనీ తెలంగాణ న్యూ ఎనర్జీ పార్క్, మహబూబ్‌నగర్‌లో ACC తయారీ, బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ కోసం దేశంలోని అతిపెద్ద లిథియం-అయాన్ గిగా ఫ్యాక్టరీలలో ఒకటైన గిగా కారిడార్‌ను ఏర్పాటు చేస్తోంది. శంషాబాద్‌లోని ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ అనే R&D హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు అంచనా రూ. 9,500 కోట్లు.. ఇది 4,500 మందికి ప్రత్యక్ష ఉపాధిని అందించనుంది.