కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. యశ్వంత్ సిన్హాతో వీహెచ్ భేటీ.. ఎందుకు కలవరని జగ్గారెడ్డి ప్రశ్న
Defying TPCC orders, Hanumantha Rao meets Yashwant Sinha. తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య ఐక్యత లేమి మరోమారు బయటపడింది.
By Medi Samrat Published on 2 July 2022 4:01 PM IST
తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య ఐక్యత లేమి మరోమారు బయటపడింది. శనివారం మధ్యాహ్నం నగరానికి వచ్చిన ప్రతిపక్ష పార్టీల అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో సమావేశాన్ని దాటవేయాలని టీపీసీసీ ముందుగానే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల పార్టీలోని సీనియర్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీపీసీసీ ఆదేశాలను ధిక్కరిస్తూ.. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. యశ్వంత్ సిన్హాను స్వాగతిస్తున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు ఆయనను కలిశారు. ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో జరిగే సమావేశానికి దూరంగా ఉండాలని టీపీసీసీ నిర్ణయించింది. అయితే.. కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరకాటంలో పడేస్తూ వీహెచ్.. యశ్వంత్ సిన్హాను కలవడం చర్చనీయాంశమైంది.
హైద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ నేతలు కలిసే ఏ నాయకుడిని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలవరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అని, కాంగ్రెస్ అభ్యర్థి కాదని కూడా ఆయన చెప్పారు. కాంగ్రెస్ మద్దతు మాత్రమే ఇస్తోందని రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. అయినా.. హనుమంతరావు మరికొందరు పార్టీ కార్యకర్తలతో కలిసి బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి యశ్వంత్ సిన్హాను కలిశారు. ఈ చర్యపై టీపీసీసీ నేతలు ఇప్పటివరకూ ఎవరూ స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచిచూడాల్సిందే.
ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తన వెర్షన్ బయటపెట్టారు. యశ్వంత్ సిన్హాను ఎందుకు కలవరని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధిష్టానం తో మాట్లాడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ని సీఎల్పీ కి ఆహ్వానించేది ఉండాల్సిందని.. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.