టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో జరగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి మాట్లాడుతూ.. ప్రచార కార్యక్రమాలు బూత్ లెవెల్ వరకు వెళ్ళాలని సూచించారు. ప్రతి రోజు ప్రచార అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరిగేలా ప్రణాళిక ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. తుక్కుగుడా లో 6వ తేదీన జరగబోయే సభలో.. ప్రచార కార్యక్రమాలలో ఏఐసీసీ మ్యానిఫెస్టో ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.
ఏఐసీసీ పాంచ్ న్యాయ్ పేరుతో ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని.. పాంచ్ న్యాయ్ అంశాలను తెలుగులో అనువదించి కింది స్థాయి వరకు ప్రచారం చేయాలని సూచించారు. ఏఐసీసీ ఇచ్చే ప్రతి ప్రచార కార్యక్రమాలను ఇక్కడ క్షేత్ర స్థాయికి వెళ్లేలా ప్రచారం చేయాలన్నారు. స్థానికంగా ఉండే సమస్యలను అక్కడే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ఇంకా కొన్ని రోజులు ఉన్నందున ప్రతి రోజు క్రియాశీలకంగా పని చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని.. కాంగ్రెస్ పాలనలో చేసిన ప్రజా పాలన పనులను, మోడీ, కేసీఆర్ చేసిన ప్రజా వ్యతిరేక పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు.