హైడ్రా పోలీస్ స్టేషన్‌ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

ఈ నెల 8వ తేదీన హైడ్రా పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.

By Knakam Karthik
Published on : 5 May 2025 11:56 AM IST

Telangana, Cm Revanthreddy, Hydra, Hydra Police Station

హైడ్రా పోలీస్ స్టేషన్‌ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

హైదరాబాద్ అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులు, పార్కులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా హైడ్రా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా విభాగానికి మరిన్ని అధికారాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన హైడ్రా పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి రేవంత్ సర్కార్ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్‌లోని బీ-బ్లాక్‌లో హైడ్రా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

అలానే హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైడ్రా ఏర్పాటుపై ప్రశ్నలు రావడంతో.. సర్కార్ జీహెచ్‌ఎంసీ చట్టం 1955ను సవరించింది. డీఎస్పీ స్థాయి అధికారితో పాటు సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా భూ ఆక్రమణలపై ఫిర్యాదు చేసేందుకు హైడ్రాకు పోలీస్ స్టేషన్ లేకపోవడంతో కబ్జాలకు పాల్పడిన ఆక్రమణదారులపై హైడ్రా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయించింది. హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆక్రమణలు, కబ్జాలకు సంబంధించి హైడ్రానే నేరుగా కేసులు నమోదు చేయనుంది.

నగరంలోని జలాశయాలు, ఇతర ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ.. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374 బి సెక్షన్‌ను చేర్చింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం అంతా హైడ్రా పోలీసు స్టేషన్ పరిధిలోనికి రానున్నట్లు తెలుస్తుంది. ఓఆర్ఆర్ లోపల ఎక్కడ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా అయినా.. ఇకపై హైడ్రా పోలీసు స్టేషన్‌లోనే కేసులు నమోదు చేయనున్నారు.హైడ్రా పోలీస్ స్టేషన్ రాకతో.. ఇకపై నగరంలో.. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల వ్యవహారంలో జరిగే అక్రమ ఆక్రమణలపై స్థానికులు, అధికారులు నేరుగా హైడ్రా పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటివరకు సాధారణ పోలీస్ స్టేషన్లలో నమోదైన భూకబ్జా కేసులపై హైడ్రా దాడులు జరుపుతూ వస్తోంది. అయితే త్వరలోనే ఈ కేసులు సాధారణ పోలీసు స్టేషన్ల నుంచి హైడ్రా స్టేషన్‌కు బదిలీ అయ్యే అవకాశం ఉంది. హైడ్రా పోలీసు స్టేషన్ వల్ల ఈ కేసులు తర్వగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది.

Next Story