గ్రేటర్ ఎన్నికలపై స్టే ఇవ్వలేం: హైకోర్టు
Dasoju Sravan File Pil In High Court Over GHMC Elections.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఆపాలంటూ హైకోర్టులో
By సుభాష్ Published on 17 Nov 2020 7:48 AM ISTగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఆపాలంటూ హైకోర్టులో దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారించింది. సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్దంగా బీసీ రిజర్వేషన్‌లు అమలు చేస్తున్నారంటూ ఏఐసీసీ అధికారి ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ పిల్ దాఖలు చేశారు. అత్యవసర పిటిషన్‌గా స్వీకరించి విచారణ జరపాలని శ్రవణ్ తరపున న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా వెనుకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని, విద్యారంగంలో బీసీల రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు వేరువేరని న్యాయవాది వాదించారు.
అనంతరం దీనిపై స్పందించిన హైకోర్టు పిల్ దాఖలు చేసిన శ్రవణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు పదేళ్ల కిందట తీర్పు ఇస్తే ఇప్పటి వరకకు ఏం చేశారని మండిపడింది. ఎంబీసీలపై ప్రేముంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్ ఇవ్వబోయే చివరి క్షణంలో ఆ విషయం గుర్తుకు వచ్చిందా..? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్నికలు ఆపే విధంగా రాజకీయ కోణంలో ఈ పిల్ దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్ విచారణ చేపడతాం కానీ.. ఎన్నికలపై స్టే ఇవ్వలేమిన హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీకి నోటీసులు జారీ చేసింది.