సీఎంపై చర్యలు తీసుకోవాలి : అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఖ‌మ్మంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ స్పందించారు.

By -  Medi Samrat
Published on : 19 Jan 2026 6:15 PM IST

సీఎంపై చర్యలు తీసుకోవాలి : అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో చేసిన వ్యాఖ్యలపై ఆయన అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. నోటికి హద్దులు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని మండిప‌డ్డారు. తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్‌ను 100 మీటర్ల లోతు పాతిపెడతానన్న మాటలు ప్రజాస్వామ్య విరుద్ధమని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో 1200 మంది అమరుల బలిదానాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు చేస్తున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని తెలంగాణ పోలీసులను కోరిన‌ట్లు చెప్పారు.

సికింద్రాబాద్ అస్థిత్వంపై ప్రశ్నించిన మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్‌పై కేసులు పెట్టడం అన్యాయమని వ్యాఖ్యానించారు. అదే సెక్షన్లను సీఎం రేవంత్ రెడ్డిపైనా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసుతో టీడీపీ పతనానికి బీజం వేసింది రేవంత్ రెడ్డేనని విమర్శించారు. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్‌ఎస్ పార్టీని కూల్చేస్తానని మాట్లాడటం రాజకీయ దౌర్జన్యమన్నారు. రేవంత్ రెడ్డి శరీరం కాంగ్రెస్‌ది.. ఆత్మ మాత్రం టీడీపీదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ–టీడీపీతో చీకటి రాజకీయాలు చేస్తూ తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నాడని విమర్శించారు. హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుంద‌న్నారు.

Next Story