ఆగస్టు 16 నుంచి 'దళిత బంధు'

Dalitha Bandhu Starts From August 16th. ఆగస్టు 16 నుండి 'దళిత బంధు' పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని

By Medi Samrat  Published on  2 Aug 2021 3:23 AM GMT
ఆగస్టు 16 నుంచి దళిత బంధు

ఆగస్టు 16 నుండి 'దళిత బంధు' పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని, రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్ధం కావాలని కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ విస్తృతంగా చర్చించింది. కేబినెట్ సమావేశంలో దళిత బంధు పథకం పూర్వాపరాలను సీఎం విశదీకరించారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనీ, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయనీ ముఖ్యమంత్రి అన్నారు. దళిత జాతి పేదరికం రూపుమాపాలని ప్రవేశపెడుతున్న 'తెలంగాణ దళిత బంధు' పథకానికి రాష్ట్ర కేబినెట్ ముక్త కంఠంతో ఆమోద ముద్ర వేసింది. దళిత జాతి కష్టాలు తీర్చడానికి ప్రవేశపెడుతున్న తెలంగాణ దళిత బంధు పథకం అమలుకు సంబంధించి మంత్రివర్గ సభ్యులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

ఈ సందర్భంగా దళిత బంధు పథకానికి చట్ట భద్రత కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేబినెట్ అభిప్రాయపడింది. గతంలో ఎస్సి ప్రగతి నిధి చట్టం తెచ్చి, ఒక వార్షిక బడ్జెట్ లో దళితులకు కేటాయించిన నిధులలో మిగిలిన నిధులను తరువాతి వార్షిక బడ్జెట్ కు బదలాయించే విధానం తీసుకొచ్చామన్నారు. ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అదే విధంగా దళిత బంధు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందని కేబినెట్ అభిప్రాయపడింది.

రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీన స్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో ఇరవై శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగు భూమి కేవలం పదమూడు లక్షల ఏకరాలే అని దళితుల పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

దళితుల అభివృద్ధి, అరకొర సహాయాలతో సాధ్యం కాదని, అందుకే దళిత బంధులో ఒక యూనిట్ పెట్టుకోవడానికి పదిలక్షల రూపాయల పెద్ద మొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం అన్నారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయంలో ఆర్థిక స్థితిలో మెరుగుదల రాదనీ ముఖ్యమంత్రి తెలియజేశారు. లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెద్ద పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునే అవకాశాన్ని దళిత బంధు పథకం ద్వారా కల్పించాలనే ముఖ్యమంత్రి నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకునే స్వేచ్చ లబ్ధిదారులదే అని, ప్రభుత్వం అధికారులు, దళిత బంధు స్వచ్చంద కార్యకర్తలూ ఈ దిశగా మార్గదర్శనం చేస్తారని, అవగాహన కల్పిస్తారని ముఖ్యమంత్రి అన్నారు.

లబ్ధిదారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ అవగాహన కల్పించాలని క్యాబినెట్ అభిప్రాయపడ్డది. శిక్షణ, పర్యవేక్షణ కోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. అమలులో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ''సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్'' ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. యూనిట్ పెట్టగానే ప్రభుత్వ బాధ్యత తీరిపోదని యూనిట్ సరిగ్గా నడుస్తుందా లేదా అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించడం కూడా ముఖ్యమని కేబినెట్ తీర్మానించింది.

దళిత బంధు పథకం అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరమని వివిధ శాఖలలో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావును కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు ద్వారా ఎవరికైతే లబ్ధి చేకూరుస్తారో వారికి అందజేసే ఒక ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్ పరిశీలించింది. ఈ కార్డు ఆన్లైన్ అనుసంధానం చేసి లబ్ధిదారుని పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. దళిత వాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా అన్ని హంగులూ దళిత వాడలకు ఏర్పడాలని.. ఇందుకు నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


Next Story