త్వరలోనే దళిత బంధు నిధులు విడుద‌ల చేస్తాం : సీఎం కేసీఆర్‌

Dalitha Bandhu Scheme Funds Release Soon. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా

By Medi Samrat  Published on  18 Dec 2021 4:00 PM GMT
త్వరలోనే దళిత బంధు నిధులు విడుద‌ల చేస్తాం : సీఎం కేసీఆర్‌

తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే 'దళిత బంధు' పథకం లక్ష్యమని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. దళిత బంధు పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే పది లక్షల రూపాయలు, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా సామాజిక పెట్టుబడిగా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో దోహద పడుతుందని సీఎం స్పష్టం చేశారు. దళిత బంధును ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో ప్రభుత్వం అమలుచేస్తుందని, అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును ముందుగా ప్రకటించిన విధంగా అమలు చేస్తామన్నారు.

తాము ఎప్పుడూ మోసగించబడుతామనే దుఃఖం దళిత వాడల్లో వుందని, వారి ఆర్తిని అర్థం చేసుకుని పనిచేయాల్సిన అవసరం వుందన్న సీఎం.. "మీకు ఆకాశమే హద్దు. మీరు ఇప్పటి వరకు చేసిన ఏ పనిలో లేని తృప్తి దళిత బంధు పథకం అమలులో పాల్గొనడం ద్వారా దొరుకుతుందని" కలెక్టర్లనుద్దేశించి అన్నారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు వున్న అన్ని అవకాశాలను, వ్యాపార, ఉపాధి మార్గాలను శోధించాలని, అందుకు దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, తదితర దళిత సామాజిక అభివృద్ధి కాముకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.


Next Story