వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చునన్నారు. ఆధార్ సంఖ్య ఇవ్వని వారికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ తరువాత ఆన్‌లైన్‌లో మ్యుటేషన్ వెంటనే జరుగుతుందన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విధానంలో రిజిస్టార్లు సహా అధికారులెవరికీ ఎలాంటి విఛక్షణాధికారాలు ఉండవని తెలిపారు.
రిజిస్ట్రేషన్ తరువాత వెంటనే డాక్యుమెంట్లు వెంటనే ఇస్తామని.. ఈ పాస్‌బుక్, ఆరెంజ్ రంగు పాసుపుస్తకాలు కూడా జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ లేనివారి విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని.. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఓపెన్ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునన్నారు.