ఇకపై నాగార్జునసాగర్ ను ఎవరు పహారా కాస్తారంటే.?

నాగార్జునసాగర్ జలాల విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రయత్నం చేస్తోంది

By Medi Samrat  Published on  1 Dec 2023 9:00 PM IST
ఇకపై నాగార్జునసాగర్ ను ఎవరు పహారా కాస్తారంటే.?

నాగార్జునసాగర్ జలాల విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రయత్నం చేస్తోంది. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో శుక్రవారం కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగిస్తూ.. నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించాలని సూచించారు. సిఆర్పిఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రతిపాదించారు .ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి.

నాగార్జున సాగర్‌ విషయంలో కొందరు రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నాగార్జున సాగర్‌ సగం గేట్లు ఏపీ భూభాగంలోనే ఉన్నాయని అన్నారు. అక్కడికి తాము వెళ్లాలన్నా తెలంగాణ పోలీసుల పర్మిషన్‌ తీసుకోవాల్సి వస్తోందని, అక్కడికి వెళ్లి తమ వాటా నీళ్లు వదులుకోవడం తమ హక్కు, అందుకే అక్కడికి వెళ్లామన్నారు. తాము దండయాత్ర చేయలేదని, తమ రాష్ట్ర హక్కును కాపాడుకున్నామని తెలిపారు.

Next Story