ఆగస్టు 15 నాటికి పంట రుణాలను మాఫీ చేస్తాం : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

తెలంగాణలో ప్రభుత్వం ఆగస్టు 15 లోగా రైతులకు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  15 July 2024 8:51 PM IST
ఆగస్టు 15 నాటికి పంట రుణాలను మాఫీ చేస్తాం : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

తెలంగాణలో ప్రభుత్వం ఆగస్టు 15 లోగా రైతులకు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులను అప్పుల బాధ నుంచి విముక్తం చేసేందుకు ఒకే దఫాలో పంట రుణాలను మాఫీ చేసేందుకు కట్టుబడి ఉంది.. పంట రుణాల మాఫీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. రైతుల ఆర్థిక సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. 2023 డిసెంబర్‌లో అధికారం చేపట్టిన వెంటనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాం.. ఇది రైతులందరికీ ఏడాదికి ఎకరాకు రూ.15,000 పెట్టుబడి మద్దతునిస్తుందన్నారు.

ఆయకట్టును పెంచేందుకు కనీస పెట్టుబడితో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్‌ఎస్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌, పేరుమార్చి ప్రజాధనాన్ని వృథా చేశారు. వాటి వల్ల రైతులకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీరందించలేకపోయిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారాన్ని సృష్టించే బదులు ఆచరణాత్మక పరిష్కారాలు, స్పష్టమైన ఫలితాలపై దృష్టి సారిస్తుంది. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంద‌న్నారు. అన్ని ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎంఎస్‌పి కంటే తక్కువ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా మధ్యవర్తులు, వ్యాపారులను కట్టడి చేస్తున్నామ‌న్నారు.

ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని.. వ్యవసాయ కార్యకలాపాలను యాంత్రీకరించడంతో పాటు.. వ్యవసాయ దిగుబడిని మెరుగుపరచడానికి.. పెంచడానికి సాంకేతికత, కృత్రిమ మేధస్సును ఉపయోగించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందజేసేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. పంట రుణాల మాఫీ సహా పలు కీలక అంశాలపై రానున్న అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తామని మంత్రి ఉత్త‌మ్ తెలిపారు.

Next Story