Telangana: పంట రుణమాఫీ కాలేదంటున్న కొందరు రైతులు.. అయినవారు కొత్త లోన్ కోసం దరఖాస్తులు
హైదరాబాద్: రూ.లక్ష రుణమాఫీ తమకు జరగలేదంటూ వ్యవసాయ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి.
By అంజి Published on 20 July 2024 10:02 AM ISTTelangana: పంట రుణమాఫీ కాలేదంటున్న కొందరు రైతులు.. అయినవారు కొత్త లోన్ కోసం దరఖాస్తులు
హైదరాబాద్: రూ.లక్ష రుణమాఫీ తమకు జరగలేదంటూ వ్యవసాయ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవోలకు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు రుణమాఫీ జరిగిందో లేదో తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రూ.లక్షలోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను ప్రశ్నించారు.
మరికొందరు రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు పంట రుణమాఫీ అందిన ఒక రోజు తర్వాత, ఖరీఫ్ సీజన్‌లో తాజా రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆనందంతో బ్యాంకుల ముందు క్యూ కట్టారు. పంట రుణాల మాఫీకి సంబంధించిన వివరాలు, సహాయం అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో చురుగ్గా సమన్వయం చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు తమ అనుభవాలను మిత్రులు, బంధువులతో పంచుకుంటూ రుణమాఫీపై సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు హర్షం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో 41,474 మంది రైతులకు రూ.225.62 కోట్లు, కామారెడ్డిలో 45,221 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.233.41 కోట్లు జమ అయ్యాయి. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ నందిపేటకు చెందిన సత్యనారాణ అనే రైతు మాట్లాడుతూ.. ''ఇటీవలే నా పంట రుణాన్ని రెన్యూవల్ చేశాను.. ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం నా ఖాతాలో బ్యాలెన్స్‌గా ఉంది. బ్యాంకుకు తిరిగి చెల్లించబడుతుంది" అని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ నిధుల కేటాయింపు కోసం లక్ష రూపాయలకు పైగా రుణాలు ఉన్న రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రుణమాఫీ వల్ల ప్రమాణాలు, అర్హతల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. స్పష్టమైన ఆదేశాలు లేవని బ్యాంకు ఉద్యోగి ఒకరు తెలిపారు. రుణాలు తీసుకున్న రైతుల వివరాలు ఆయా శాఖలకు అందలేదన్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి బంగారాన్ని పూచీకత్తుగా తీసుకున్న రైతులకు మాఫీ విషయంలో గందరగోళాన్ని ఎత్తిచూపారు. పౌరసరఫరాల శాఖ జారీ చేసే ఆహారభద్రత కార్డుల డేటాబేస్ ఆధారంగా అర్హతలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైన గుర్తింపు పత్రాలకు సంబంధించి మంత్రుల ప్రకటనలు రైతులను అయోమయంలో పడేశాయి.