మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ పోటీ చేయబోదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం స్పష్టం చేశారు. భువనగిరి మండలం అనాజిపురంలో మూసీ శుద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ చేపట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన వీరభద్రం.. రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికలలో సీపీఐ(ఎం) మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలపై స్పష్టత ఇస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేస్తానన్నారు.
ఖమ్మం జిల్లాలో జరిగిన తమ్మినేని కృష్ణయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మూసీ నది నీటితో 160 ఇరిగేషన్ ట్యాంకులు నిండాయని, మూసీ ఐదు కాల్వల ద్వారా కూడా సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని గుర్తు చేశారు. జిల్లాలోని పరిశ్రమలు మూసీలో రసాయన వ్యర్థాలను విడుదల చేయడంతో నీరు విషతుల్యంగా మారుతోంది. పరిశ్రమలు మూసీలోకి అక్రమంగా రసాయన వ్యర్థాలను వదులుతున్నాయని, వాటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.